Nara Lokesh: అధికారంలోకి వచ్చాక రుషికొండ ప్యాలెస్ లో ఏముందో పరిశీలిస్తాం: నారా లోకేశ్

  • విజయనగరంలో యువగళం సభ
  • హాజరైన నారా లోకేశ్
  • కూటమి గెలిచాక విశాఖను ఐటీ రాజధాని చేస్తామని వెల్లడి
  • చంద్రబాబుకు కట్టడమే తెలుసు, కూల్చడం తెలియదని స్పష్టీకరణ
Nara Lokesh attends Yuvagalam meeting in Vijayanagaram

రాబోయే ఎన్నికల్లో కూటమి విజయదుందుభి మోగించి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నాన్ని ఐటీ రాజధానిగా తీర్చిదిద్దుతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. విజయనగరం ఎంఆర్ స్టేడియం గ్రౌండ్ లో ఏర్పాటుచేసిన యువగళం సభలో లోకేశ్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.... అధికారంలోకి వచ్చాక మూడునెలలకే జగన్ మూడు ముక్కలాట మొదలెట్టారని విమర్శించారు. కర్నూలు న్యాయరాజధాని, ఉత్తరాంద్రకు పరిపాలన రాజధాని, లెజిస్లేటివ్ క్యాపిటల్ గా అమరావతి అన్నారని వెల్లడించారు. కానీ కర్నూలులో ఒక్క ఇటుకలేదు, అమరావతిని సర్వనాశనం చేశాడు అంటూ మండిపడ్డారు. 

"విశాఖపట్నంలో ఒక్క భవనమైనా కట్టారా? రుషికొండకు గుండుకొట్టి ఒక్క వ్యక్తి బతకడానికి రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నారు. ఆ డబ్బుతో విజయనగరం జిల్లాలో పేదలందరికీ ఇళ్లు నిర్మించే అవకాశం ఉండేది. నిబంధనలు ఉల్లంఘించి రుషికొండలో కట్టిన ప్యాలెస్ కు కేంద్రం రూ.200 కోట్ల పెనాల్టీ కూడా విధించింది. మొత్తం రూ.700 కోట్లు దుర్వినియోగం చేశారు. రాష్టపతి భవనానికి కూడా అంత ఖర్చుపెట్టలేదు. 

కూల్చడం టీడీపీ బ్లడ్ లో లేదు. చంద్రబాబుకు కట్టడమే తెలుసు, కూల్చడం తెలియదు, ఎప్పుడు నిర్మాణాలు చేయాలి, పిల్లల భవిష్యత్ మార్చాలని ఆలోచిస్తారు, బిడ్డల జీవితాలు మార్చాలని ఆలోచించే వ్యక్తి చంద్రబాబు. అధికారంలోకి వచ్చాక ముందు రుషికొండ ప్యాలెస్ లో ఏం ఉందో పరిశీలించి, దేనికి ఉపయోగించాలో నిర్ణయిస్తాం. 

2019లో రాష్ట్ర ప్రజలు ఒక్క అవకాశం మాయలో పడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రలో ఒక్క పరిశ్రమ గానీ, ఒక్కరికి ఉద్యోగం గానీ వచ్చిందా? ఎక్కడ చూసినా భూకబ్జాలు, దోపిడీలు, ఇసుక, గంజాయి, డ్రగ్స్ మాఫియాలు, హత్యలు, మానభంగాలు. పక్క రాష్ట్రాల పత్రికల్లో ప్రతిరోజూ పెట్టుబడుల వార్తలు వస్తున్నాయి. 

జగన్ ఒక బిల్డప్ బాబాయి, వెయ్యికోట్ల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి నువ్వే మా నమ్మకం అని బోర్డులు పెట్టారు. కుటుంబసభ్యులే ఆయనను నమ్మడం లేదు, వైసీపీ నాయకులను వారి కుటుంబసభ్యులు నమ్మడం లేదు. హత్యారాజకీయాలు చేసిన అన్నను నమ్మవద్దని చెల్లి సునీత చెప్పింది. జగన్ కు ఓటువేస్తే మా కుటుంబానికి పట్టిన గతే రాష్ట్రానికి అని చిన్నమ్మ సౌభాగమ్మ చెప్పింది, జగనన్న ఊసరవెల్లి అని చెల్లెమ్మ షర్మిల చెప్పింది, వైఎస్ విజయలక్ష్మి కూడా భయపడి అమెరికా వెళ్లిపోయింది. కుటుంబసభ్యులే నమ్మని జగన్ ను ప్రజలు ఎలా నమ్మాలి? 

అంబటి రాంబాబు నీచుడు, దుర్మార్గుడు అని ఆయన అల్లుడు చెప్పారు, సొంత కొడుకుకే న్యాయం చేయలేదని ముత్యాలనాయుడు కుమారుడు చెప్పాడు. ముద్రగడ గారి కూతురు మీడియా ముందు వైఎస్ జగన్ మా తండ్రిని ట్రాప్ లో పడేశారని, వాడుకుని వదిలేస్తాడని చెప్పింది. దువ్వాడ శ్రీను భార్య తన భర్తకు ఓటువేయద్దని చెప్పింది. జగన్, వైసీపీ నాయకులను వారి కుటుంబసభ్యులు నమ్మడం లేదు. 5 కోట్ల మంది ప్రజలు ఎలా నమ్మాలి? 

2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రభుత్వం అశోక్ గజపతిరాజు గారిని ఎంత ఇబ్బంది పెట్టిందో చూశాం. కేంద్ర, రాష్ట్ర మంత్రిగా ఆయన పనిచేశారు. ఇవ్వడమే తప్ప చేయిచాచి తీసుకునే గుణం ఆయనకు లేదు. అలాంటి కుటుంబంపై జగన్ దాడి చేశారు. ఆయనను సింహాచలం ట్రస్ట్ నుంచి గెంటేశారు. సింహాచలం భూములు కొట్టేయడానికి విజయసాయి, బొత్స ప్రయత్నించారు. బొత్స కుటుంబం ఉత్తరాంద్రను క్యాన్సర్ గడ్డలా పట్టింది. 

అశోక్ గారి గురించి చెప్పాలంటే రోజంతా చెప్పాల్సి ఉంటుంది. నన్ను చిన్నప్పుడు ఎత్తుకున్నారు, అశోక్ గారిని చూస్తూ పెరిగాను. ఆయన ప్రజాదరణ చూశాను. కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రిగా గాక సామాన్యుడిలా ప్రజల జీవితాల్లో మార్పు తేవాలని ప్రయత్నించారు. అశోక్ గజపతిగారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు అదితి వచ్చారు. బొత్స కుటుంబం ఎంత అవినీతి చేశారో చూశాం, విజయనగరం ఎంత వెనుకబడిందో చూశాం, అదితిని గెలిపించి శాసనసభకు పంపండి. కూటమి బలపర్చిన కలిశెట్టి అప్పలనాయుడును గెలిపించండి" అంటూ నారా లోకేశ్ పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News